Ezekiel 48

1గోత్రాల పేర్లు ఇవి. దానీయులకు ఒక భాగం. అది ఉత్తరదిక్కు సరిహద్దు నుండి హమాతుకు వెళ్ళే మార్గం వరకూ హెత్లోనుకు వెళ్ళే సరిహద్దు వరకూ హసరేనాను అనే దమస్కు సరిహద్దు వరకూ హమాతు సరిహద్దు దారిలో తూర్పుగా, పడమరగా వ్యాపించి ఉన్న భూమి. 2దాను సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగం. 3ఆషేరీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగం.

4నఫ్తాలి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మనష్షేయులకు ఒక భాగం. 5మనష్షేయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఎఫ్రాయిమీయులకు ఒక భాగం. 6ఎఫ్రాయిమీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా రూబేనీయులకు ఒక భాగం. 7రూబేనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా యూదావారికి ఒక భాగం.

8యూదావారి సరిహద్దును అనుకొని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్టించే పవిత్రమైన స్థలం ఉంటుంది. దాని వెడల్పు 13 కిలోమీటర్ల 500 మీటర్లు దాని పొడవు తూర్పు నుండి పడమర వరకూ మిగిలిన భాగాల్లాగా ఉంటుంది. పరిశుద్ధ స్థలం దాని మధ్యలో ఉండాలి. 9యెహోవాాకు మీరు ప్రతిష్టించే ఈ ప్రదేశం 13 కిలోమీటర్ల, 500 మీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల, 400 మీటర్ల వెడల్పు ఉండాలి.

10ఈ పవిత్రమైన స్థలం యాజకులది. అది ఉత్తరాన 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, పశ్చిమాన 5 కిలోమీటర్ల 400 మీటర్ల వెడల్పు, తూర్పున 5 కిలోమీటర్ల 400 మీటర్ల వెడల్పు, దక్షిణ దిక్కున 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు ఉండాలి. యెహోవాా పరిశుద్ధస్థలం దాని మధ్య ఉంటుంది. 11ఇది సాదోకు సంతతికి చెంది నాకు ప్రతిష్టితులై నేను వారికి అప్పగించిన దానిని కాపాడే యాజకులది. ఎందుకంటే ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోయినప్పుడు మిగిలిన లేవీయులు వారితో పోయినట్టు వారు నన్ను విడిచిపోలేదు. 12పవిత్రమైన భూమిలో లేవీయుల సరిహద్దు దగ్గర వారికొక స్థలం ఉంటుంది. దానిని అతి పరిశుద్ధంగా ఎంచుతారు.

13యాజకుల సరిహద్దును ఆనుకొని లేవీయులకు ఒక స్థలం ఏర్పాటు చేయాలి. అది 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, ఐదు కిలోమీటర్ల 400 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ రెండు స్థలాల మొత్తం పొడవు 13 కిలోమీటర్ల 500 మీటర్ల, వెడల్పు పది కిలో మీటర్ల 800 మీటర్ల ఉంటుంది. 14అది యెహోవాాకు ప్రతిష్ఠితమైన భూమి కాబట్టి దానిలో ఏ కొంచెం భాగమైనా వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు, ఆ భూమి ప్రథమ ఫలాలను ఇతరులను అనుభవింపనియ్య కూడదు.

1513 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, రెండు కిలోమీటర్ల 700 మీటర్ల వెడల్పు ఉన్న మిగిలిన స్థలం సమిష్టి భూమిగా ఎంచి, పట్టణంలో నివాసాలకు, మైదానాలకు వాడాలి. దాని మధ్య నగర నిర్మాణం జరుగుతుంది. 16నగర పరిమాణ వివరాలు, ఉత్తరాన రెండు కిలోమీటర్ల 400 మీటర్ల, దక్షిణాన రెండు కిలోమీటర్ల 400 మీటర్ల, తూర్పున రెండు కిలోమీటర్ల 400 మీటర్ల, పశ్చిమాన రెండు కిలోమీటర్ల 400 మీటర్ల,

17నగరానికి చేరిన ఖాళీ స్థలం ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు పడమటి వైపు, నాలుగు దిక్కులలో సమానంగా 135 మీటర్లు ఉండాలి. 18పవిత్రమైన భూమిని ఆనుకొని ఉన్న మిగిలిన భూమి ఫలం పట్టణంలో పనిచేసి జీవించే వారికి ఆధారంగా ఉంటుంది. అది పవిత్రమైన భూమిని ఆనుకొని తూర్పున ఐదు కిలోమీటర్ల 400 మీటర్లు, పడమటి వైపున ఐదు కిలోమీటర్ల 400 మీటర్ల, ఉంటుంది.

19ఏ గోత్రపు వారైనా పట్టణంలో కష్టపడి జీవించేవారు దానిని సాగుబడి చేస్తారు. 20పవిత్రమైన భూమి అంతా 13 కిలోమీటర్ల 500 మీటర్ల నలు చదరంగా ఉంటుంది.

21పవిత్రమైన భూమికి, నగరానికి ఏర్పాటైన భూమికి రెండు వైపులా ఉన్న భూమి పాలకునిది. తూర్పున 13 కిలోమీటర్ల 500 మీటర్లు గల పవిత్రమైన భూమి నుండి అది తూర్పు సరిహద్దు వరకూ వ్యాపిస్తుంది. పడమర 13 కిలోమీటర్ల 500 మీటర్లు గల పవిత్రమైన భూమి నుండి అది పడమర సరిహద్దు వరకూ వ్యాపిస్తుంది. 22యూదా వారి సరిహద్దుకు, బెన్యామీనీయుల సరిహద్దుకు మధ్యగా ఉన్న భాగం పాలకునిది. ఆ భాగం లోనే లేవీయుల స్వాస్థ్యం, నగరానికి ఏర్పాటైన భూమి ఉంటాయి.

23తూర్పు నుండి పడమటి వరకూ కొలవగా మిగిలిన గోత్రాలకు భాగాలు ఏర్పాటవుతాయి. 24బెన్యామీనీయులకు ఒక భాగం, వారి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా షిమ్యోనీయులకు ఒక భాగం. 25షిమ్యోనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఇశ్శాఖారీయులకు ఒక భాగం. 26ఇశ్శాఖారీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా జెబూలూనీయులకు ఒక భాగం.

27జెబూలూనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా గాదీయులకు ఒక భాగం. 28దక్షిణదిక్కున తామారునుండి కాదేషులో ఉన్న మెరీబా ఊటలవరకూ నది వెంబడి మహా సముద్రం వరకూ గాదీయులకు సరిహద్దుగా ఉంటుంది. 29మీరు చీట్లువేసి ఇశ్రాయేలీయుల గోత్రాలకు పంచిపెట్టాల్సిన దేశం ఇదే. వారి వారి భాగాలు ఇవే. ఇదే యెహోవాా ఇచ్చిన ఆజ్ఞ.

30నగర వైశాల్యం ఉత్తరాన రెండు కిలోమీటర్ల 400 మీటర్లు. 31ఇశ్రాయేలీయుల గోత్రాల పేర్ల ప్రకారం నగర గుమ్మాలకు పేర్లు పెట్టాలి. ఉత్తరాన రూబేనుదనీ, యూదాదనీ, లేవీదనీ మూడు గుమ్మాలు ఉండాలి. 32తూర్పు వైపు 2 కిలోమీటర్ల 400 మీటర్ల పొడవు ఉంది. ఆ వైపున యోసేపుదనీ, బెన్యామీనుదనీ, దానుదనీ, మూడు గుమ్మాలుండాలి.

33దక్షిణం వైపు రెండు కిలోమీటర్ల 400 మీటర్ల పొడవు. ఆ వైపున షిమ్యోనుదనీ, ఇశ్శాఖారుదనీ, జెబూలూనుదనీ, మూడు గుమ్మాలుండాలి. 34పడమటి వైపు రెండు కిలోమీటర్ల 400 మీటర్ల పొడవు. ఆ వైపున గాదుదనీ, ఆషేరుదనీ, నఫ్తాలిదనీ మూడు గుమ్మాలుండాలి. 35ఆ నగరం చుట్టు కొలత తొమ్మిది కిలోమీటర్ల, 700 మీటర్ల పొడవు. <<యెహోవాా ఉండే స్థలం>> అని ఆనాటి నుండి ఆ పట్టణానికి పేరు.

Copyright information for TelULB